Important Contact Numbers of The University of Hyderabad link https://www.uohyd.ac.in/index.php/administration/contact

ముఝే యాద్ రఖ్ నా ...!

















" పర్ దేశీ పర్ దేశీ జానా నహీ
ముఝే చోడ్ కే ముఝే చోడ్ కే...
పర్ దేశీ మేరీ యారా వాదా నిభానా
ముఝే యాద్ రఖ్ నా కహీ భూల్ నజానా..."
ఒక పాట ఎంతమందికి జీవనాధారం
ఒక పాట ఎంతమందికి జీవనోత్సాహం!
అలసిసొలసి పయనించేవారిని అలసట తీర్చేది
ఓ సన్నజీరగొంతు, రెండు చిల్ల పెంకుల్లో దూరి
గొప్ప ఆహ్లాదాన్నిచ్చేది
ప్రతీ సాయంత్రం సంధ్య కిరణాల్ని చూడకపోయినా
పూడ్చ లేని ఏదో వెలితిని తీర్చేది!
సృష్టి విచిత్రమయ్యిందే!
పూవుల్లోని తాజాదనాన్నో
రంగుల్లోని మేళవింపునో
ప్రకృతిలోని కిలకిలరావల్నో
రాబట్టాలనెంత ప్రయత్నించినా
ఎక్కడో తొంగి చూసే కృత్రిమత్వమే!
" పర్ దేశీ పర్ దేశీ జానా నహీ
ముఝే చోడ్ కే ముఝే చోడ్ కే...
పర్ దేశీ మేరీ యారా వాదా నిభానా
ముఝే యాద్ రఖ్ నా కహీ భూల్ నజానా..."
ఆ గొంతులో దూరి అనుకరించినా
కళ్ళున్నవాళ్ళకీ కొత్త ప్రపంచాన్ని చూపే కొత్త పాటయ్యేది!
తొలిసారివిన్నప్పుడు
'పక్కబోగీలోకి పోతే బాగుణ్ణు '
అనుకున్న ఆ సహించలేని చెవులిప్పుడు
ఆ చేతి కర్ర మువ్వల చప్పుడు కోసమైనా వెతుకులాట!
పాడేదొకేపాట " పర్ దేశీ పర్ దేశీ...'
ఒక చరణమయ్యో, పల్లవయ్యో మాత్రమే
పైసాకోసం చాపే చేతిలో
ఇప్పుడెంత పెట్టాలన్నా ఎలాసాధ్యం?
గడ్డి పోచకీ విలువుంటుంది
బతుకునెంత పరవశింపజేసింది
కోల్పోయినప్పుడే పాట విలువ తెలిసింది
ఇప్పుడెల్లే ఆ రైల్లో పాట కోల్పోయిన అనాథలెందరో !!
" పర్ దేశీ పర్ దేశీ జానా నహీ
ముఝే చోడ్ కే ముఝే చోడ్ కే...
పర్ దేశీ మేరీ యారా వాదా నిభానా
ముఝే యాద్ రఖ్ నా కహీ భూల్ నజానా..."

-డా. దార్ల వెంకటేశ్వర రావు
ఈకవిత దట్స్ తెలుగు (20-12- 2005)లో ప్రచురితం
( రైలులో పాటలు పాడు కొంటూ బతుకు కొనసాగించే వాళ్ళను చూసి, జాలితో చిల్లర వేయకపోయినా పర్వాలేదు.కానీ అవమానించని వారందరికీ ఈ కవిత అంకితం)

No comments: